ఆర్య-2' చిత్రం కోసం ప్రేక్షకాభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఈనెల 25వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అల్లు అర్జున్, కాజల్ తొలిసారి జంటగా నటిస్తున్నఈ చిత్రాన్ని ఆదిత్య ఆర్ట్స్ బ్యానర్ పై ఆదిత్యబాబు, భోగవల్లి ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. సుకుమార్ దర్శకుడు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో గతంలో విజయవంతమైన 'ఆర్య' చిత్రానికి ఇది సీక్వెల్. నవదీప్, శ్రద్ధాదాస్ మరో జంటగా నటించారుఆదిత్యబాబు మాట్లాడుతూ, ఇటీవలే విడుదలైన 'ఆర్య-2' ఆడియో సంచలనం సృష్టిస్తోందనీ, పాటలన్నీ పెద్ద హిట్ అయ్యాయనీ అన్నారు. ఇంత పెద్ద మ్యూజికల్ హిట్ ఇచ్చిన దేవీశ్రీప్రసాద్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. అలాగే అల్లు అర్జున్ నటన అందర్నీ ఆకట్టుకుంటుందనీ, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం తెరకెక్కిందనీ చెప్పారు. సినిమాలోని ప్రతి విభాగం హైలైట్ గా నిలుస్తుందన్నారు. ఈనెల25న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నామని చెప్పారు. తమిళ నటుడు ఆర్య విలన్ గా నటించిన ఈ చిత్రంలో సంతోష్ సాహు, నేతాజీ నాయుడు తదితరులు నటించారు. ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ అందించారు.