skip to main |
skip to sidebar
విశ్వనాథ్ మళ్లీ డెరెక్షన్
తెలుగు సినిమా కీర్తిని దిగంతాలకు చాటిన కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ మళ్లీ దర్శకత్వం వహిస్తే చూడాలని కోరుకునే అభిమానులకు కొదవలేదు. 'శంకరాభరణం', 'స్వాతిముత్యం', 'సాగరసంగమం', 'సిరివెన్నెల', 'స్వయంకృషి', 'శుభలేఖ', 'శుభసంకల్పం', 'స్వర్ణకమలం' వంటి ఎన్నో కళాత్మక చిత్రాలను అందించిన సినీ స్రష్ఠ విశ్వనాథ్. విశ్వనాథ్ సినిమా తీస్తే ఆ ఏడాది నందులన్నీ ఆయన ఇంటికే క్యూ కడతాయని ఫిల్మ్ మేకర్స్ అనుకునే వారు. అలాగే జరిగేది కూడా. ఆయన చివరిసారిగా 2004లో హీరో శ్రీకాంత్ తో కలిసి కీలక పాత్ర పోషిస్తూ 'స్వరాభిషేకం' చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ రాజరాజేశ్వరి కంబైన్స్ పతాకంపై సి.కౌసలేంద్ర రావు ఆ చిత్రాన్ని నిర్మించారు. దీనికి ఉత్తమాభిరుచి ఉన్న చిత్రంగా ప్రశంసలు దక్కినా బాక్సాఫీస్ ఫలితం నిరాశపరచింది. ఆ చిత్రం తర్వాత మళ్లీ విశ్వనాథ్ కెమెరా వెనక్కి వెళ్లలేదు. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడపాదడపా ఆయన నటిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో విశ్వనాథ్ దర్శకత్వంలో మరో సినిమా చేయాలని కౌసలేంద్రరావు చేసిన ప్రయత్నాలు ఫలించాయనీ, విశ్వనాథ్ ఇందుకు అంగీకరించారనీ సినీ వర్గాల తాజా సమాచారం. ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ విశ్వనాథ్ దర్శకత్వం వహించనున్న చిత్రంలో నటించే అవకాశం ఎవరిని వరించనుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలోనే నటీనటుల ఎంపిక జరిపి సెట్స్ పైకి వస్తారని తెలుస్తోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం వహించనున్నట్టు తెలిసింది. కళాతపస్వి చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండటం కూడా ఇదే ప్రథమం. మరిన్ని వివరాలు త్వరలోనే వెలుగుచూడనున్నాయి
No comments:
Post a Comment