Monday, October 12, 2009

'రక్తచరిత్ర'కు శ్రీకారం

పరిటాల రవి జీవిత చరిత్ర ఆధారంగా రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న చిత్రం 'రక్తచరిత్ర'. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్, తమిళ నటుడు సూర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎ సినెర్జీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మధు మంతెన, షీతల్ వినోద్ తల్వార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైద్రాబాద్ లోని తాజ్ బంజారాలో చిత్ర విశేషాలను రామ్ గోపాల్ వర్మ ఆదివారంనాడు తెలియజేశారు. మధు మంతెన, షీతల్ వినోద్ తల్వార్ పాల్గొన్నారు.

యదార్ధ వ్యక్తుల యదార్థ సంఘటనతో ప్రభావితమైన కల్పిత గాథగా ఈ చిత్రం ఉంటుందని వర్మ తెలిపారు. 'పరిటాల రవి జీవిత చరిత్రపై సినిమాల తీయాలనే ఆలోచన ఇప్పటిది కాదు. ఐదేళ్లుగా ఈ ఆలోచన ఉంది. ఇందుకోసం రీసెర్చ్ వర్క్ చేశాను. రవి కుటుంబ సభ్యులను కూడా కలుసుకుని పలు విషయాలు తెలుకున్నాను. రాయలసీమకు చెందిన ఎందరో వ్యక్తుల్ని కలిశాను. రెండు వర్గాలుగా చెలామణి అవుతున్న వారి వద్ద నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు.వారు చెప్పేది వారి వైపు నుంచి చూస్తే కరెక్టే అనిపిస్తుంది. ఇవతలి వైపు నుంచి చూస్తే తప్పనిపిస్తుంది. కథకు ఉపకరించే అంశాలను మాత్రమే తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. సబ్జెక్ట్ పరిధి ఎక్కువ కావడంతో కేవలం రెండు గంటల్లో చెప్పడం సాధ్యం కాదు. అందువల్లే సెకెండ్ పార్ట్ కూడా చేయబోతున్నాం. రెండు పార్ట్ లు సమాంతరంగా షూటింగ్ జరుగుతాయి. రక్తచరిత్ర-1 విడుదలైన వారం రోజుల తర్వాత రక్తచరిత్ర-2 విడుదలవుతుంది. ఈ తరహా ప్రయోగం తెలుగు సినీ చరిత్రలో ఇదే ప్రథమం. రాయలసీమ ఫ్యాక్షనిజయం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రతి సన్నివేశం రియలిస్టిక్ గా ప్రేక్షకులకు అందించాలని ఈ సినిమా చేస్తున్నాం. హీరో, విలన్ తరహాలో ఎవర్నీ ప్రెజెంట్ చేయబోవడం లేదు. ఇలానే జరిగి ఉంటుందేమోనని అనిపించేలా సన్నివేశాలు ఉంటాయి' అని వర్మ చెప్పారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో షూటింగ్ జరుగుతుందనీ, మూడు భాషల్లోనూ వివేక్, సూర్య నటిస్తున్నారనీ చెప్పారు. ఎన్టీరామారావు పాత్రను మోహన్ బాబు పోషించనున్నారనీ, తక్కిన నటీనటుల వివరాలు త్వరలోనే తెలియజేస్తామనీ చెప్పారు. హైద్రాబాద్, అనంతపురం ప్రాంతాల్లో షూటింగ్ కు ప్లాన్ చేశారు.

No comments:

Post a Comment