Wednesday, October 21, 2009

పరిటాల సునీతగా కంగన?!

పరిటాల రవి జీవత కథతో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'రక్తచరిత్ర' చిత్రం ఇప్పటికే పలు ఆందోళనకు తెరతీసింది. ఇప్పడిప్పుడే చల్లారుతున్న ఫ్యాక్షన్ కక్షలను వర్మ చిత్రం తిరగదోడే అవకాశాలున్నట్టు పలువురు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వర్మ మాత్రం కూల్ గా తన పని తాను చేసుకుపోతున్నారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కిస్తున్నారు. మూడు భాషల్లోనూ పరిటాల రవి పాత్రను వివేక్ ఒబెరాయ్, సూరి పాత్రను తమిళ హీరో సూర్య పోషిస్తున్నారు. అలాగే మరికొన్ని కీలక పాత్రలకు ప్రముఖ నటీనటులను ఆయన ఎంపిక చేస్తూ ఎప్పటికప్పుడు సినిమాపై సరికొత్త అంచనాలు, క్రేజ్ పెంచుకుంటూ పోతున్నారు. పరిటాల రవికి టిడిపి తరఫున టిక్కెట్ ఇచ్చిన ఎన్టీఆర్ పాత్రను తెలుగులో డాక్టర్ ఎం.మోహన్ బాబు చేత, హిందీలో శత్రుఘ్నసిన్హా చేత చేయించనున్నారు. వర్మ చిత్రంలో హీరోయిన్లు సహజంగానే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అవుతుంటారు. మరి 'రక్తచరిత్ర'లో హీరోయిన్ ఎవరనేది మాత్రం ఆయన సస్పెన్స్ మెయింటెన్ చేస్తున్నారు. పరిటాల రవి భార్య పరిటాల సునీత పాత్రకు కూడా సినిమాలో ప్రాధాన్యం ఉండబోతోందట. 'రక్తచరిత్ర-2'లో ఆ పాత్రకు మంచి వెయిట్ ఉంటుందని తెలుస్తోంది. ఈ పాత్రను బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ ను అనుకుంటున్నట్టు బలంగా వినిపిస్తోంది.

బాలీవుడ్ యంగ్ బ్యాచ్ హీరోయిన్లలో కంగనా ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకోగా, ప్రస్తుతం ప్రభాస్ 'ఏక్ నిరంజన్'లోనూ హీరోయిన్ గా నటిస్తూ టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. 'రక్తచరిత్ర'లో పరిటాల సునీత పాత్రకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా కంగనా పేరును వర్మ పరిశీలిస్తున్నారనీ, అలాగే సూరి భార్య భానుమతి పాత్రకు కూడా పాపులర్ హీరోయిన్ ఒకరిని అనుకుంటున్నారనీ తెలుస్తోంది. అయితే వర్మ మనసులో ఎవరున్నారనేది మాత్రం పోనుపోను తెలియాల్సిందే...

No comments:

Post a Comment