Sunday, October 4, 2009

'జయీభవ' ఆడియో రిలీజ్

నందమూరి కల్యాణ్ రామ్, హన్సిక జంటగా నరేన్ కొండేపాటి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న చిత్రం 'జయీభవ'. ఆ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమాలు నందమూరి హీరోలు, పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో రామానాయుడు స్టూడియోస్ లో గురువారం రాత్రి కన్నులపండువగా జరిగింది. థమన్ ఎస్. సంగీతం అందించిన ఆడియో క్యాసెట్ ను డాక్టర్ ఎం.మోహన్ బాబు ఆవిష్కరించి తొలి ప్రతిని హరికృష్ణకు అందజేశారు. ఆడియో సీడీని బాలకృష్ణ ఆవిష్కరించి ఎన్టీఆర్ కు అందజేశారు. నందమూరి రామకృష్ణ, తారకరత్న, సురేష్ బాబు, ఆలీ, తేజ, రామజోగయ్య శాస్త్రి, జెమినీ కిరణ్, దయానంద్ తదితరులు పాల్గొన్నారు.తొలుత మోహన్ బాబు మాట్లాడుతూ, నందమూరి కుటుంబంతో తనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందనీ, ఆ కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా తనను తప్పకుండా ఆహ్వానిస్తారనీ అన్నారు. కల్యాణ్ రామ్ తొలి సినిమాకు తానే క్లాప్ కొట్టాననీ, అప్పట్నించి ప్రతి సినిమాకూ తనకు పిలుస్తారనీ చెప్పారు. కల్యాణ్ రామ్ మంచి క్రమశిక్షణ ఉన్న వ్యక్తనీ, ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాననీ అన్నారు. హరికృష్ణ మాట్లాడుతూ, నాన్నకు స్వయంకృషితో పైకి రావడం అంటే ఇష్టమనీ, అందుకునే ఆ మహనీయుడికి కొడుకులుగా పుట్టినా తమ ఎదుగుదల విషయంలో ఆయన ఏనాడూ జోక్యం చేసుకోలేదని అన్నారు. సొంత కాళ్లపై నిలబడాలన్నదే ఆయన అభిప్రాయమనీ, ఎన్టీఆర్ చరిత్ర పురుషుడనీ అన్నారు. ఇటీవల జరిగిన వేడుకల్లో తెలుగు పరిశ్రమకు ఎవరెవరో ఏదో చేశారని చెబుతూ ఎన్టీఆర్ పేరును విస్మరించారనీ, 1970 దశకంలో పరిశ్రమకు ఆయన ఎంతో చేశారనీ అన్నారు. నాన్నగారి చాలా సినిమాలు హైద్రాబాద్ లోనే తీసిన విషయాన్ని విస్మరించరాదని అన్నారు. తమను ఎప్పటికప్పుడు తారాపథంలో నిలబడెతున్న అభిమానులందరికీ కృతజ్ఞతలని అన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ, సినిమా టైటిల్ చూస్తుంటే నాన్నగారు దర్శకత్వం వహించి నటించిన 'దానవీరశూరకర్ణ' చిత్రంలోని 'జయీభవ విజయీభవ' అనే పల్లవితో సాగే పాట గుర్తొస్తోందనీ, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రంతో హ్యాటిక్ హిట్ సాధించడం ఖాయమనీ అన్నారు. అన్నయ్య కష్టపడి తీసిన రెండు సినిమాలు హిట్టయ్యాయనీ, ఈ చిత్రం కూడా హిట్ కావాలని కోరుకుంటున్నాననీ తారకరత్న పేర్కొన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ, అన్నయ్య కల్యాణ్ రామ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడనీ, తప్పనిసరిగా సినిమా మంచి హిట్ అవుతుందనీ అన్నారు. తేజ మాట్లాడుతూ, తాను ఎన్టీఆర్ అభిమానిననీ, కల్యాణ్ రామ్ తో కూడా ఓ సినిమా చేశాననీ అన్నారు. కల్యాణ్ నటించిన ఈ చిత్రం కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు. 'జయీభవ' చిత్రానికి జయం చేకూరాలని ఆహుతులంతా అభిలషించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.

1 comment: