Wednesday, November 11, 2009

సిఎం ఆవిష్కరించిన 'బిందాస్'

మంచు మనోజ్ కుమార్, షీన హీరోహీరోయిన్లుగా ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఎటివి సమర్పణలో సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న చిత్రం 'బిందాస్'. రచయిత వీరుపోట్ల తొలిసారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం రాత్రి శిల్పారామంలో జరిగింది. ముఖ్యమంత్రి కె.రోశయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి ఆడియో సీడీని ఆవిష్కరించారు. తొలి ప్రతిని మనోజ్ కుమార్, మలి ప్రతిని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అందుకున్నారు. పద్మశ్రీ మోహన్ బాబు, పలువురు చిత్ర ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఎ సిరీస్ ద్వారా ఆడియో మార్కెట్ లోకి విడుదలైంది
ముఖ్యమంత్రి రోశయ్య మాట్లాడుతూ, ఈ చిత్రం ఆడియో తో పాటు సినిమా కూడా మంచి సక్సెస్ సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని అభిలషించారు. సినిమా, పాటలు చాలా బాగా వచ్చాయనీ, మంచి టీమ్ వర్క్ తో రూపొందిన ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని మోహన్ బాబు అన్నారు. సుంకర రామబ్రహ్మం మాట్లాడుతూ, రోశయ్య గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆవిష్కరించిన తొలి సినిమా ఆడియో తమదే కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. బోబు శశి అందించిన పాటలన్నీ చాలా బాగా వచ్చాయనీ, ఆడియో మంచి హిట్ అవుతుందనీ అన్నారు. సినిమా 50 శాతం మాస్, 50 శాతం క్లాస్, 100 శాతం బిందాస్ అన్నారు. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని వీరుపోట్ల తెలిపారు. స్క్రిప్టు కూడా బాగా కుదిరిందనీ, మనోజ్ రిస్క్ తీసుకుని చేసిన పలు ఫైట్స్ సినిమాకి హైలైట్స్ అవుతాయని అన్నారు. మనోజ్ మాట్లాడుతూ, ఇది మంచి కమర్షియల్ హిట్ అవుతుందని నమ్ముతున్నాననీ, బోబు మంచి సంగీతం అందించారనీ చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఎ.ఎం.రత్నం, శ్రీనివైట్ల, దిల్ రాజు, వి.ఎన్.ఆదిత్య, విశ్వనాథ్ కాశీ, రాజారవీంద్ర, భువనచంద్ర, రజిత తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment