Tuesday, November 3, 2009

నరేష్ ను కాదన్న శ్రుతి?

కళాతపస్వి కె.విశ్వనాధ్ కూ, పద్మశ్రీ కమల్ హాసన్ కూ ఉన్న అనుబంధం జగమెరిగినదే. ఈ ఇద్దరి కాంబినేషన్ లో 'సాగరసంగమం', 'స్వాతిముత్యం', 'శుభసంకల్పం' వంటి ఆణిముత్యాలు వచ్చాయి. ఇప్పుడు కమల్ కూతురు శ్రుతి హాసన్ కు కూడా విశ్వనాథ్ చిత్రంలో నటించే అవకాశం వరించినప్పటికీ ఆమె అంతగా ఆసక్తి చూపలేదంటూ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. విషయానికి వస్తే...2004లో విశ్వనాథ్ 'స్వరాభిషేకం' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రం కమర్షియల్ సక్సెస్ కానప్పటికీ నిర్మాత సి.కౌసలేంద్రరావు ఉత్తమాభిరుచికి అద్దం పట్టింది. ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ విశ్వనాథ్ ను ఒప్పించి కౌసలేంద్రరావు తాజాగా ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. ఇటీవలే కథా చర్చలు కూడా ముగిసి, మణిశర్మ సంగీత దర్శకత్వంలో మ్యూజిక్ సిట్టింగ్స్ నడుస్తున్నాయి. మరోవైపు నటీనటుల ఎంపిక జరుగుతోంది. హీరోగా ఇప్పటికే అల్లరి నరేష్ ఎంపిక పూర్తయింది. హీరోయిన్ గా శ్రుతి హాసన్ ను అనుకోవడంతో కమల్ సైతం తన కుమార్తెను ఒప్పించే ప్రయత్నాలు చేశారట. కారణాలు తెలియనప్పటికీ ఆ ఆఫర్ ఎందుకో శ్రుతికి రుచించలేదట.

విశ్వనాథ్ ఇప్పుడు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అనిల్ కపూర్ కుమార్తె అయిన సోనమ్ హిందీలో వచ్చిన 'ఢిల్లీ 6' ద్వారా మంచిపేరు తెచ్చుకుంది. విశ్వనాథుల వారంటే అనిల్ కు కూడా మంచి గౌరవం. ఈ నేపథ్యంలో సోనమ్ ను అనిల్ ఒప్పించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అల్లరి నరేష్ తో నటించేందుకు సోనమ్ అయినా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది వేచిచూడాల్సిందే.

No comments:

Post a Comment