Thursday, November 12, 2009

అక్కినేని 'గురుతులు' సీడీ

ప్రముఖ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు 65 ఏళ్ల నటజీవిత విశేషాలతో మాటీవీలో ప్రసారమైన 'గుర్తుకొస్తున్నాయి' ధారావాహికను మోజర్ బేర్ సంస్థ సీడిలుగా విడుదల చేసింది. అన్నపూర్ణా స్టూడియోస్ లో గురువారం ఉదయం జరిగిన కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా 'గుర్తుకొస్తున్నాయి' వీసీడీల ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా 'ఆంధ్రప్రభ' సంపాదకులు విజయ్ బాబు, మోజర్ బేర్ ప్రతినిధులు ధనుంజయ్, శివప్రసాద్, సతీష్ కుమార్, మాటీవీ సిఇవో శరద్ మురార్, సీనియర్ పాత్రికేయుడు రాజా, అక్కినేని కుమార్తె నాగసుశీల, మనుమరాలు సుప్రియ తదితరులు పాల్గొన్నారు.
అక్కినేని బహుముఖ ప్రతిభావంతులనీ, ఆయన నట జీవిత విశేషాలను తెలియజేసే ధారావాహిక ఇప్పుడు సీడీల రూపంలో ఆయన చేతుల మీదుగానే విడుదల కావడం చాలా గొప్ప విషయమనీ విజయ్ బాబు అన్నారు. సీడీల రూపంలో రావడం వల్ల మరింత మంది అక్కినేని జీవిత విశేషాలను తెలుసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. మా టీవీలో ఈ కార్యక్రమాన్ని చేసిన రాజా మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలను వృత్తిపరంగా చేయాలంటే సాధ్యం కాదనీ, అక్కినేనిపై ఉన్న అభిమానంతో, ఆయన సహకారంతోనే ధారావాహికగా చేయడం జరిగిందనీ చెప్పారు. అక్కినేని మాట్లాడుతూ, వృత్తిపరంగా, వ్యక్తిగతంie విజయాలు, అపజయాలు చవిచూశాననీ, తనకు ఇప్పటికీ ఆ విశేషాలు గుర్తుండటం అదృష్టమనీ అన్నారు. తన జీవితంలోని విశేషాలను మాటీవీ వారు వెలికి తెప్పించారని పేర్కొన్నారు. 'దేవదాసు' తర్వాత తనకు అన్నీ తాగుబోతు పాత్రలే వచ్చాయనీ, వాటిని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాననీ, అలాగే 'మిస్సమ్మ' చేస్తున్నప్పుడు అందరూ తనను తిట్టారనీ, ఆ విశేషాలన్నీ తన జ్ఞాపకాలుగా మోజర్ బేర్ అందిస్తున్న సీడీల్లో ఉన్నాయనీ అన్నారు

No comments:

Post a Comment