Tuesday, November 3, 2009

ఎన్టీఆర్ గెటప్ లో షాట్ గన్

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన సూపర్ స్టార్ పొలిటీషియన్ నందమూరి తారకరామారావు గెటప్ లో మరో పొలిటీషియన్ సూపర్ స్టార్ శత్రుఘ్నసిన్హా కనిపించి అలరించబోతున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రతిష్ఠాత్మకంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రెండు పార్ట్ లుగా తెరకెక్కిస్తున్న 'రక్త చరిత్ర' కోసం షాట్ గన్ శత్రుఘ్నసిన్హా ఇప్పుడు ఎన్టీఆర్ అవతారం ఎత్తారు. పరిటాల రవి నిజజీవిత సంఘటన ఆధారంగా 'రక్త చరిత్ర' తెరకెక్కుతోంది. పరిటాల రవిగా వివేక్ ఒబెరాయ్, సూరిగా తమిళ హీరో సూర్య ఈ మూడు భాషల్లో నటిస్తున్నారు. పరిటాల రవికి అప్పట్లో తెలుగుదేశం టిక్కెట్ ఇచ్చిన ఎన్టీఆర్ పాత్రకూ ఇందులో ప్రాధాన్యం ఉండటంతో ఆ పాత్రకు శత్రుఘ్న సిన్హాను వర్మ ఎంపిక చేశారు.

వర్మ ఇప్పటికే ఎన్టీఆర్ కు సంబంధించిన పలు క్లిప్పింగ్ లు శత్రుఘ్న సిన్హాకు ఇచ్చి ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. శత్రుఘ్న సిన్హా తన అభిమానులు ఇంతవరకూ చూడని కొత్త గెటప్ లో ఇప్పుడు కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన మీసం కూడా తీసేశారు. మూడున్నర దశాబ్దాల నట జీవితంలో ఆయన మీసం లేకుండా కనిపంచనుండటం ఇదే ప్రథమం. ఇందుకు పూర్తి భిన్నంగా ఇంతవరకూ మీసం లేకుండానే నటించిన వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో తొలిసారిగా కోర మీసంతో కనిపించబోతున్నారు.

No comments:

Post a Comment