Wednesday, November 11, 2009

తారకరత్న సైకోపాత్..

విలనీ పాత్రలతో పరిచయమై హీరోలుగా నిలబడిన టాలీవుడ్ హీరోలకు కొదవలేదు. తొలినాళ్లలో నెగిటివ్ పాత్రలు పోషించిన చిరంజీవితో పాటు మోహన్ బాబు, శ్రీకాంత్, శ్రీహరి వంటి పలువురు ఆ తర్వాత హీరోలుగా పాపులర్ అయ్యారు. మోహన్ బాబు హీరో అయిన తర్వాత కూడా అడపాదడపా విలనీ పాత్రలు పోషించారు. అయితే హీరోలుగా పరిశ్రమలోకి అడుగుపెట్టి విలనీ పాత్రలకు వైపు మళ్లిన వారు తక్కువ. 'తొలివలపు' చిత్రంతో హీరో అయిన గోపీచంద్ ఆ సినిమా ఫ్లాప్ కావడంతో 'జయం', 'వర్షం', 'నిజం' చిత్రాల్లో వరుసగా విలన్ పాత్రలు పోషించి బాగా పాపులర్ అయిన తర్వాతే తిరిగి హీరో వేషాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు గోపీచంద్ తరహాలోనే మరో హీరో సరైన బ్రేక్ కోసం విలన్ వేషాలకు మళ్లారు. ఆ నటుడు నందమూరి మూడోతరం వారసుడు తారకరత్న
ప్రపంచ సినీ చరిత్రలోనే ఏకకాలంలో తొమ్మిది సినిమాలతో ఘనమైన ఆరంభం చూరగొన్న నటుడు తారకరత్న. కారణాంతరాల వల్ల కొన్ని సినిమాలు రెగ్యులర్ షూటింగ్ కు నోచుకోకపోయినా విడుదలైన సినిమాలు సైతం తారకరత్నకు హీరోగా సరైన బ్రేక్ ఇవ్వలేకపోయాయి. 'ఒకటో నెంబర్ కుర్రోడు', 'భద్రాద్రిరాముడు', 'వెంకటాద్రి ' వంటి వరుస ఫెయిల్యూర్స్ తో తారకరత్న ఇప్పుడు రూటు మార్చాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే తొలిసారి ఆయన అల్లరి రవిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న 'అమరావతి' చిత్రంలో నటోరియస్ క్రిమినల్ గా ఆయన కనిపించబోతున్నారు. ఇటీవలే ఈ చిత్రం ట్రయిలర్స్ విడుదల కావడం, తారకరత్న తళుక్కుమని మెరవడం ప్రేక్షకులను విస్మయానికి గురిచేస్తోంది. 'అనసూయ' వంటి హారర్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన అల్లరి రవిబాబు 'అమరావతి'తో ఎలాంటి కనికట్టుకడతారనేది ఉత్సుకత రేపుతోంది. తారకరత్న కొత్త గొటప్, మారిన పంథా ఆయనకు నటుడిగా సరైన బ్రేక్ ఇస్తుందేమో చూడాలి

No comments:

Post a Comment