మాస్...బాస్...డాన్...ఇవన్నీ నాగార్జునే. ఈ సినిమాలన్నీనాగార్జునలోని ఫైర్ ను చూపించినవే. ప్రస్తుతం ఆయన కామాక్షి కళా మూవీస్ పతాకంపై రూపొందుతున్న 'రమ్మీ' (వర్కింగ్ టైటిల్) చిత్రంలో పక్కా మాస్ పాత్రను పోషించబోతున్నారు. ఆసక్తికరంగా ఆయన తదుపరి చిత్రం రాధామోహన్ దర్శకత్వంలో ఉండబోతోంది. రాథామోహన్ చిత్రాలంటే చాలా సాఫ్ట్ గా, భావోద్వాగాలు మేళవించిన ఇతివృత్తాలతో ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయం. ఇందుకు ఉదాహరణ ఇటీవల ఆయన తీసిన 'ఆకాశమంత' చిత్రం. ఆ చిత్రం నాగార్జునకు ఎంతగానో నచ్చడంతో తన తదుపరి చిత్రాన్ని రాధామోహన్ తో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో రాధామోహన్ ఉన్నారు. వేర్వేరు ఇమేజ్ ఉన్న నాగార్జున-రాధామోహన్ ల కాంబినేషన్ ఎలా ఉండబోతోందనే చర్చ కొద్దికాలంగా జరుగుతూనే ఉంది. ఇందుకు రాధామోహన్ వద్ద సమాధానం ఉండనే ఉంది.
'నాగార్జున నా సినిమాకి హీరో అని చెప్పగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. నాగార్జునతో సాప్ట్ స్టోరీ చేయకూడదా? నేను మాత్రం నా స్టయిల్ లోనే ఈ సినిమా కూడా తీయబోతున్నాను. అందులో ఎలాంటి మార్పు లేదు' అని రాథామోహన్ చెప్పారు. ఈ చిత్రానికి 'పయనం' అనే టైటిల్ కూడా ఖరారైంది. ఈ చిత్రంలో కథానాయకుడు ఓ రైలు జర్నీలో తన గత అనుభవాలు నెమరువేసుకుంటాడనీ, విభిన్న భావోద్వాగాలతో ఈ చిత్రం ఉంటుందనీ ఆయన తెలిపారు. 50 శాతం సినిమా రైలులోనే సాగుతుంది. ఇందుకోసం 25 రోజుల పాటు ఓ రైలుని అద్దెకి తీసుకోబోతున్నారు. స్క్రిప్టును బట్టి ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయనున్నట్టు ఆయన చెప్పారు. మొత్తానికి డిసెంబర్ లో మొదలయ్యే ఈ చిత్రం కోసం నాగార్జున 25 రోజులు రైలు జర్నీ చేస్తారన్నమాట
No comments:
Post a Comment