Thursday, October 8, 2009

'మహాత్మ'పై కోర్టుకి

శ్రీకాంత్ 100వ చిత్రంగా ప్రతిష్ఠాత్మకంగా కృష్ణవంశీ తెరకెక్కించిన 'మహాత్మ' చిత్రం విడుదలకు మరి కొద్ది గంటలే ఉన్న తరుణంలో కొత్త చిక్కులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహాత్మా గాంధీ ఆశయాల స్ఫూర్తితో ఓ యువకుడు ఎలా ఉద్యమించాడనే కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే సెన్సార్ చిక్కుల వల్ల ఈనెల 2న విడుదల కావాల్సిన సినిమా ఒకసారి వాయిదా పడి 9వ తేదీకి ముహూర్తం నిశ్చయించుకుంది. థియేటర్లు కూడా కన్ ఫర్మ్ అయ్యాయి. ఈ తరుణంలో ఈ చిత్రంలోని 'నీలంపురి గాజులు' అనే పాట తనదేననీ, తన అనుమతి లేకుండా పాటను వాడుకున్నారంటూ అవుదూరి లక్ష్మణ్ అనే వ్యక్తి గురువారంనాడు కోర్టును ఆశ్రయించారు.

నాలుగేళ్ల క్రితం తాను చేసిన ఆల్బమ్ లోని పాట ఇదనీ, తన పాటలో నాలుగు చరణాలు ఉంటాయనీ, ఇందులోని రెండు చరణాలను 'మహాత్మ' చిత్రంలో ఉపయోగించుకున్నారని, ఇది కాపీ రైట్ ఉల్లంఘన కిందకు వస్తుందనీ అవుదూరి లక్ష్మణ్ తన పిటిషన్ లో పేర్కొన్నట్టు సమాచారం. కోట్లాది రూపాయల వ్యాపారం చేసే నిర్మాతలు ఇలాంటి చౌర్యానికి పాల్పడటం, కనీసం తన పేరు కూడా ఇవ్వకపోవడం ఆక్షేపణీయమని ఆయన పేర్కొన్నారు. ఇటీవల 'మగధీర' చిత్రంలోని ఓ పాట పల్లవి తనదేనంటూ వంగపండు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో 'మహాత్మ' సైతం ఇలాంటి అభియోగాన్నే ఎదుర్కొంటుండటం చర్చనీయాంశమవుతోంది. అసలే ఒకసారి విడుదల వాయిదా పడి...ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వరద బాధిత పరిస్థితుల తరుణంలో విడుదలకు సిద్ధమవుతున్న 'మహాత్మ' తాజా పరిస్థితులను ఏ విధంగా తట్టుకుంటుందనేది చూడాలి

No comments:

Post a Comment