skip to main |
skip to sidebar
మహాత్మ' రివ్యూ
భరత మాత దాస్య శృంఖలాల విముక్తికి స్వాతంత్ర్య స్ఫూర్తి రగిల్చి జాతి మొత్తాన్ని ఏకతాటిపై నిలిపిన మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ ఎందరికి గుర్తున్నారు? తుపాకి తూటాలకు ఆయన నేలకొరిగి 62 ఏళ్లయింది. అలాగే ఆయన జ్ఞాపకాలూ మసకబారుతున్నాయి. బ్రిటిష్ పాలకులను తరిమికొట్టిన బాపూజీ సత్యం, అహింస అస్త్రాలు తుప్పుపట్టిన పరికరాలవుతున్నాయి. గాంధీజీ కోరుకుంటే దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతో, లేకుంటే ప్రధాన మంత్రో అయ్యుండేవారే. పదవులను తృణప్రాయంగా భావించిన త్యాగశీలి బాపూ. పదవులు, దానితో వచ్చే పలుకుబడి, తరతరాలు తిని కూర్చున్నా తరగని సంపద ప్రోగుచేసుకోవడమే ఇప్పటి నేతల పరమావధిగా మారుతోంది. రాజకీయాలు అత్యున్నత సంపాదనా మార్గాలు అవుతున్నాయి. గాంధీజీ అందరికీ కావాలి. కానీ ఆయన ఆచరించి చూపిన సిద్ధాంతాలు ఎవరికీ అక్కర్లేదు. సత్యం, అహింస అనేవి వెర్రివాళ్ల ప్రేలాపనగా హేళనకు గురవుతున్నాయి. ఎన్నో తీరాల ఆవల ఉన్న ఒబామా అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైనప్పటి తొలి ప్రసంగంలో మన మహాత్మాగాంధీ తనకు స్ఫూర్తి అని చెప్పడం చూస్తే...బాపూజీ జ్ఞాపకాలను తుంగలో తొక్కుతున్న మనం సిగ్గుపడొద్దూ? మరి కింకర్తవ్యం?. 'పట్టుదల, ఆశయం ఉంటే ఎవరైనా గాంధీ కాగలడు. గాంధీ కొంతమందికో, వీధి పేర్లకో పరమితం కాదు. ఆయన అందరివాడు. గాంధీజీ అంటే...ఒక సిద్ధాంతం...ఒక మతం...ఒక ఆదర్శం..ఒక నిజం' అని 'మహాత్మ' చిత్రం ద్వారా దర్శకుడు కృష్ణవంశీ నికార్సయిన నిబబద్ధతో చెప్పదలచుకున్నారు. సినిమా అనేది వ్యాపారమే అయినా సమాజం పట్ల దర్శకులకు ఎంతో కొంత డెడికేషన్ ఉండాలనుకునే కృష్ణవంశీ తన అన్ని సినిమాల్లోనూ అంతర్లీనంగా ఓ సందేశం ఉండేలా చూసుకుంటారని మరో సారి నిరూపించుకున్నారు. 'మహాత్మ' పేరు మీద సినిమా చేయడమనే 'నోబుల్ థాట్'ను సెల్యులాయెడ్ కు ఎక్కించడటమంటే నిజంగా సాహసమే. అలాగే నటుడిగా శ్రీకాంత్ 100వ మైలురాయికి చేరుకున్నాడు. ఈ తరుణంలో కృష్ణవంశీ-శ్రీకాంత్ కాంబినేషన్ ప్రేక్షకాభిమానుల్లోనూ క్యూరియాసిటీని పెంచింది. అంచనాలనూ రెకెత్తించింది. 'మహాత్మ' నడక ఇలా సాగింది...
No comments:
Post a Comment