Friday, November 13, 2009

ప్రకాష్-లలిత 'అవగాహన'

నటుడు ప్రకాష్ రాజ్ విడాకుల వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ప్రకాష్ రాజ్, ఆయన భార్య లలిత మధ్య విడాకుల విషయంలో పరస్పర అంగీకారం కుదిరింది. ప్రకాష్ రాజ్ కొద్దికాలం క్రితమే తన భార్య లలితతో విడాకులు ఇప్పించాల్సిందిగా డైవోర్స్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిని లలిత మొదట్నించీ వ్యతిరేకిస్తూ వచ్చారు. వీరికి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం వారిరువురూ తల్లి సంరక్షణలోనే ఉన్నారు
హీరో శ్రీహరి భార్య అయిన శాంతి శ్రీహరి సోదరే లలిత. ఆమె సైతం కొన్ని సినిమాల్లో నటించారు. ఆ క్రమంలోనే లలితను ప్రకాష్ రాజ్ పెళ్లాడారు. ప్రకాష్ రాజ్ వేరే పెళ్లికి సిద్ధపడి లలితతో విడాకులు కోరినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రకాష్ రాజ్ కు మరో పెళ్లి అయినట్టు అప్పట్లో ఇటీవల కొన్ని ఫోటోలు బయటకు రావడం కూడా దుమారం రేపింది. ప్రకాష్ రాజ్ తన పిల్లల సంరక్షణ చూడటం లేదనీ, వారి పోషణ చేయలేని పరిస్థితిలో తాను ఉన్నాననీ లలిత పేర్కొన్నారు. అయితే తన పిల్లలను తన దగ్గరకు రానీయడం లేదంటూ ప్రకాష్ రాజ్ చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్-లలిత మధ్య పలు దఫాలుగా జరిగిన కౌన్సిలింగ్ కూడా ఫలించలేదు. ఎట్టకేలకు ఉభయ పక్షాలూ ఓ అంగీకారానికి వచ్చాయనీ, లలిత కుమారి మెయింటెనెన్స్ కోసం కొంత సొమ్ము ఇచ్చేందుకు ప్రకాష్ రాజ్ ఒప్పుకున్నారనీ తెలుస్తోంది. ఆ మొత్తం ఎంతనేది ఈ ఇద్దరి తరఫు న్యాయవాదులు ఇంకా పెదవి విప్పలేదు. తనకూ, తన ఇద్దరు కుమార్తెలకు మెయింటెనెన్స్ ఇవ్వాలని లలిత స్పష్టం చేయడం, దీనిపై ఓ అంగీకారానికి కుదరడంతో విడాకుల మంజూరుకు మార్గం సుగమమైంది.

No comments:

Post a Comment