Sunday, October 4, 2009
మరో 24 గంటలు భారీవర్షం
విశాఖపట్నం : ఒక వైపున వరద ముంచెత్తి రాష్ట్రం అల్లాడిపోతుంటే బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే రెండు రోజుల్లో పరిస్థితులను గమనించిన తరువాతే ఈ అల్పపీడనం వస్తుందా లేదా అనేది కచ్చితంగా తెలుస్తుందంటున్నారు. ఇప్పుడు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం స్థిరంగా ఉందని దీని ప్రభావంతో రాగల 24 గంటలు భారీ నుంచి కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని వారు శనివారం సాయంత్రం ఇక్కడ తెలిపారు. అల్పపీడనానికి తోడు రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతుడడంతో భారీ వర్షం కురిసే ప్రమాదం ఉందని వారు విశ్లేషించారు.క్యుములో నింబస్ మేఘాలు అకాలంగా ఆవరిస్తున్నాయని వాశాఖ వాతావరణ అధ్యయన కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ ముప్పు చాలదా అన్నట్లు అరేబియా సముద్రంలో కూడా మరో అల్పపీడన ద్రోణి ఏర్పడుతోందన్నారు. దీని ప్రభావంతో వచ్చే 48 గంటల్లో మహారాష్ట్ర, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో, కొంకణ్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని వారు విశ్లేషిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో మరింతగా భారీ వర్షాలు కురిస్తే ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ ల నుంచి శ్రీశైలానికి కనీసం మరో 10 లక్షల క్యూసెక్కుల వరదనీరు పోటెత్తే ప్రమాదం తప్పకపోవచ్చని వాతావరణ అధ్యయన కేంద్రం అధికారులు హెచ్చరించారు. అయితే, ఇదంతా జరిగేందుకు మరో రెండు రోజులు పడుతుందని ఈ లోగా రాష్ట్రంలో పరిస్థితి చక్కబడే అవకాశాలు లేకపోలేదని వారు ధైర్యం చెబుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment