Sunday, October 4, 2009

'ప్రకాశం'పై ప్రమాద హెచ్చరిక

విజయవాడ : వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతుండడంతో అధికారులు ప్రకాశం బ్యారేజిపై శనివారం సాయంత్రం రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజ్ వద్దకు 10 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమై రెండో హెచ్చరికను జారీ చేశారు. కృష్ణానదికి ఇరువైపులా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని అధికారులు హెచ్చరించారు. విజయవాడ చుట్టుపక్కల అన్ని గ్రామాలకూ వరద ముప్పు పొంచి ఉంది. మొత్తం 300 లంక గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు.కాగా, గుంటూరు జిల్లాలో 12 మండలాల్లోని 64 గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉన్న గ్రామాలను గుర్తించారు. నదీ పరీవాహక ప్రాంతాలైన దాచేపల్ి, అచ్చంపేట, మాచవరం, కొల్లూరు, కొల్లిపర, రేపల్లె, దుగ్గిరాల, అమరావతి, తాడేపల్లి తదితర మండలాల్లోని గ్రామాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.నాగార్జునసాగర్ జలాశయంలోని 26 గేట్లను ఎత్తివేసి 13.5 లక్షల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు వదిలిపెట్టారు. దీనితో ప్రకాశం బారేజ్ వద్దకు పెద్ద మొత్తంలో వరదనీరు వచ్చిచేరుతుండడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద పరిస్థితి భయానకంగా మారింది. మరికొద్ది సేపట్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీచేసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. కృష్ణానదికి దిగువన ఉన్న లంక గ్రామాలు, తీరం వెంబడి ఉన్న లోతట్టు ప్రాంతాలను కూడా అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఖాళీ చేయిస్తున్నారు.సాగర్ నీరు ఉరుకురికి వస్తుండడంతో దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. విజయవాడ సహా కృష్ణాజిల్లాలో వరద సహాయ చర్యలను మంత్రి పార్థసారథి, జిల్లా ఇన్ చార్జి మంత్రి రామచంద్రారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్షించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద పరిస్థితిని పార్థసారథి పరిశీలించారు. విజయవాడలో 30 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. నగరంలోని కరకట్ట ప్రాంతాలపైన ఉన్న నివాసితులను అధికారులు పడవల ద్వారా పునరావాస కేంద్రాలకు తరలించారు. ముంపు ప్రమాదం ఉన్న గ్రామాల ప్రజలంతా పునరావాస కేంద్రాలకు తరలివెళ్ళాలని, తరలించేందుకు వస్తున్న అధికారులకు బాధితులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బ్యారేజ్ నుంచి అవుట్ ఫ్లో 4.78 లక్షల క్యూసెక్కులు ఉందని అధికారులు తెలిపారు.విజయవాడలోని భవానీ ద్వీపంలోకి నీరుచేరింది. భవానీపురంలోని కరకట్టలోకి నీరు ప్రవేశించింది. విజయవాడ - అమరావతిల మధ్య రాకపోకలు తెగిపోయాయి. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కు వరద ముప్పు పొంచి ఉంది. ప్రకాశం బ్యారేజ్ ను 70 గేట్లను ఎత్తివేసి దిగువకు వరదనీటిని విడుదల చేస్తున్నారు.

No comments:

Post a Comment