తెలుగు సినిమా ప్రతిష్టను దశదిశలా చాటిన దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్. తెలుగువారు గర్వంగా చెప్పుకునే 'శంకరాభరణం', 'సాగరసంగమం', 'స్వాతిముత్యం', 'స్వర్ణ కమలం', 'స్వయంకృషి', 'శుభలేఖ' వంటి ఎన్నో కళాత్మక చిత్రాలను ఆయన అందించారు. ఐదేళ్ల క్రితం 'స్వరాభిషేకం' చిత్రానికి ఆయన చివరిసారిగా దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ తో కలిసి విశ్వనాథ్ ప్రధాన పాత్ర పోషించిన ఆ చిత్రాన్ని కౌసలేంద్రరావు నిర్మించారు. ఆ చిత్రం కమర్షియల్ సక్సెస్ ను సాధించకున్నా ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఆ చిత్రం తర్వాత విశ్వానాథ్ నటనకే పరిమితమవుతూ మళ్లీ మోగాఫోన్ పట్టుకోలేదు. ఎట్టకేలకు మళ్లీ నిర్మాత కౌసలేంద్రరావు పట్టుదలగా విశ్వానాథ్ ను మరో చిత్రానికి దర్శకత్వం వహించేందుకు ఒప్పించారు. ఆ చిత్రం ప్రస్తుతం నటీనటుల ఎంపిక, ప్రీ పొడక్షన్ పనులు జరుపుకొంటోంది. ఈ చిత్రానికి 'సుమధురం' అనే టైటిల్ ను నిశ్చయించినట్టు తెలిసింది.విశ్వనాథ్ చిత్రాలకు 'ఎస్' సెంటిమెంట్ ఉందంటారు. దానికితోడు కథకు కూడా ఇది యాప్ట్ టైటిల్ కావడంతో 'సుమధురం' అనే టైటిల్ ను నిశ్చయించినట్టు సమాచారం. ఇందులో అల్లరి నరేష్ కథానాయకుడుగా నటించనున్నారు. హీరోయిన్ ఎంపిక ప్రస్తుతం జరుగుతోంది. తొలుత శ్రుతి కమల్ (కమల్ హాసన్ కుమార్తె) పేరు పరిశీలనలోకి వచ్చిందనీ, ప్రస్తుతం అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ ను సంప్రదిస్తున్నారనీ తెలుస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు కూడా ముగిసి మణిశర్మ సంగీత సారథ్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. విశ్వనాథ్ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండటం ఇదే మొదటిసారి.
No comments:
Post a Comment